శృంగార సంకీర్తన
రేకు: 1960-5
సంపుటము: 29-299
రేకు: 1960-5
సంపుటము: 29-299
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| అందుకే వెరగయ్యీ నప్పటనుండి నాకు సందడి నే పెండ్లాడీ సతులాల చూడరే | ॥పల్లవి॥ |
| తప్పక యేమి చూచీ నే తలవంచుకుండఁగాను చెప్పీ నేఁటివో సుద్దులు చెవిలోనను కప్పీఁ దనపచ్చడము కడు సిగ్గయ్యీ నాకు ఇప్పు డితఁడు వలపు లెంత రేఁచీనే | ॥అందు॥ |
| చెక్కు లేల నొక్కీనే సెలవి నే నవ్వఁగాను అక్కరతోఁ గూచుండీ నండకు వచ్చి మక్కువతోఁ జన్నులంటీ మరి సోద్యమయ్యీ నాకు యిక్కడ నితఁడు నన్ను నెంత రట్టుసేసీనే | ॥అందు॥ |
| చేతు లేమి చాఁచీనే చెంగట నే నుండఁగాను కాతరాన సేసవెట్టిఁ గమ్మి కొప్పుపై ఆతుమారాఁ గాఁగిలించీ నట్టె వెరగయ్యీ నాకు యీతల శ్రీవేంకటేశుఁ డెంత మన్నించీనే | ॥అందు॥ |


