శృంగార సంకీర్తన
రేకు: 1961-2
సంపుటము: 29-302
రేకు: 1961-2
సంపుటము: 29-302
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| చెలులకునుఁ బతులకును సేయఁగల పను లివియ నెలకొన్న పొందికలు నెరపవలె సకియా | ॥పల్లవి॥ |
| వలవఁగా వలవఁగా వాడికలు కడుఁ బుట్టు తలఁచఁగాఁ దలఁచఁగా తమి రేఁగును పిలువఁగాఁ బిలువఁగాఁ బ్రేయంబు లీడేరు సొలయఁగా సొలయఁగా సొరిది మది గరఁగు | ॥చెలు॥ |
| చెనకఁగా జెనకఁగా జెలరేఁగు వేడుకలు యెనయఁగా నెనయఁగా నింపు గలుగు పెనఁగఁగాఁ బెనఁగఁగాఁ బెరుగు జవ్వనమదము తనియఁగాఁ దనియఁగాఁ దగులు నివ్వెరగు | ॥చెలు॥ |
| వొరయఁగా నొరయఁగా నుప్పతిలు సరసంబు మరుగఁగా మరుగఁగా మలయు సుఖము యిరవైన శ్రీవేంకటేశ్వురుఁడు నిను నేలె పెరుగఁగాఁ బెరుగఁగా ప్రియురాలవైతివి | ॥చెలు॥ |


