Display:
శృంగార సంకీర్తన
రేకు: 1961-6
సంపుటము: 29-306
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
ఎదుటనే వున్నాఁడు యిదె నీ రమణుఁడు
అదనిదె సరసము లాడవే యిపుడూ
॥పల్లవి॥
కలికితనంబుల కతకారీ
పలుకవే వో చిలుకలకొలికీ
తలిరు మోవిదంతపుబొమ్మా
సెలవుల నవ్వేనే చెలువునితోడా
॥ఎదుట॥
చక్కఁదనంబుల జవరాలా
నిక్కిచూడవే నీ పతిని
జక్కవ చన్నుల జగ బిరుదా
మొక్కఁగదవే మొగనికి నిపుడు
॥ఎదుట॥
పొసఁగిన నేర్పుల పూబంతీ
కొసరవే రతుల చిగురుఁబోఁడి
వసమై నిన్నేలె వలపులను
వెసఁ బొగడవే శ్రీవేంకట విభుని
॥ఎదుట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము