Display:
శృంగార సంకీర్తన
రేకు: 1963-4
సంపుటము: 29-316
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
ఎంతని పొగడవచ్చు నిటువంటి మీ గుణాలు
సంతతముఁ జూచి మాకు సంతోసములాయను
॥పల్లవి॥
సరసురాలవు నీవు జాణకాఁ డాతఁడు మరి
సరవు లిద్దరికిని సమకూడెను
వొరపరిచేఁత నీది వొద్దికెల్లా నాతనిది
సరికి బేసికి మీ సంగాతాలు చెల్లును
॥ఎంత॥
వలపులు నీ సొమ్ము వాడికెల్లా నాతనిది
తలఁపులు మీలో మీకుఁ దారుకాణలే
పిలుపులు నీ పాలు ప్రియము లాతనిపాలు
కలిగిన మీ వేడుకలు ఫలియించెను
॥ఎంత॥
నగ నీవు నేరుతువు నను పాతఁడు నేరుచు
నిగిడి మీ రతులెల్లా నెరవేరెను
జిగి దేవులవు నీవు శ్రీవేంకటేశుఁ డాతఁడు
మిగులాఁ జుట్టరికము మెరసెను మీకును
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము