Display:
శృంగార సంకీర్తన
రేకు: 1967-4
సంపుటము: 29-340
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
ఏమీ నెఱఁగవు యిన్నాళ్ళు
నీ మతకము లివి నెగడెనే కదవే
॥పల్లవి॥
వాడిక మాఁటల వలపుల చేఁతలు
యేడ నేర్చితివే యీతనితో
వేడుక నవ్వులు వేసాల సొలపులు
చూడఁ జూడఁ గడు సోద్యము గదవే
॥ఏమీ॥
పాపట దువ్వులు పయ్యద మాఁటులు
పైపై నెటువలెఁ బనుపడేనే
చూపుల చొక్కులు సురతపు రేఁపులు
నీపాలఁ గలిగి నెలకొనెఁ గదవే
॥ఏమీ॥
తీగెల యెలుఁగులు తెగని గర్వములు
సాగి యేసబలఁ జదివితివే
యీగతి శ్రీవేంకటేశుఁడు న న్నేలె
నీ గతు లతనికి బాగాయఁ గదవే
॥ఏమీ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము