శృంగార సంకీర్తన
రేకు: 1971-1
సంపుటము: 29-361
రేకు: 1971-1
సంపుటము: 29-361
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధదేశి
| ఊరకే మన మిద్దరి నుప్పతించే మింతేకాక వీరెప్పుడూను నొక్కటే వినరమ్మ చెలులు | ॥పల్లవి॥ |
| సెలవి నవ్వు నవ్వులు చిత్తము గరఁగించఁగా పలుకు చుట్టరికెము పైకొలుపఁగా కలికిచూపులు దమకములు రేఁచఁగాను వలవ కెట్టుందురమ్మ వనితలుఁ బతులు | ॥ఊర॥ |
| తక్కక మోవి తేనెలు తరితీపు సేయఁగాను మక్కువ సరసములు మరిగించఁగా చక్కఁదనములు లోలో సరి నాస వుట్టించఁగా చిక్కకెట్టుండుదురమ్మ చెలఁగి దంపతులు | ॥ఊర॥ |
| కొనగోరిచెనకులు గుట్టు విడిపించఁగాను తనువులకాఁగిళ్ళు తగిలించఁగా యెనసి శ్రీవేంకటేశుఁ డీ యలమేలుమంగను ననుచ కే లుందురమ్మ నాయకీ నాయకులు | ॥ఊర॥ |


