శృంగార సంకీర్తన
రేకు: 1971-4
సంపుటము: 29-364
రేకు: 1971-4
సంపుటము: 29-364
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఏమి సేతుఁ జెలియా యెలయించీ నితఁడు కామించి కామించి కరఁగీ నా మనసు | ॥పల్లవి॥ |
| చెలిమి సేసినవాఁడు చేరి యెప్పుడు వచ్చీనో మలసి యేమని నాతో మాఁటలాడీనో నలిరేఁగి యెటువలె నవ్వులు నవ్వీనో తలఁచి తలఁచి కడుఁ దమకించీ మనసు | ॥ఏమి॥ |
| మొగము చూచినవాఁడు మోహమెంత నెరపీనో తగులై యెట్లా నన్ను దయసేసీనో మిగులాఁ జుట్టరికమై మెచ్చి యేమి యిచ్చీనో చిగిరించి చిగిరించి చిమ్మిరేఁగీ మనసు | ॥ఏమి॥ |
| సేసవెట్టినట్టివాఁడు సేవ లెటులాఁ గొనీనో వేసరక రతి నెంత వెలయించీనో ఆసల శ్రీవేంకటేశుఁ డలమేల్మంగను నేను లాసి లాసి కూడె వుల్లాసించీ మనసు | ॥ఏమి॥ |


