శృంగార సంకీర్తన
రేకు: 1971-6
సంపుటము: 29-366
రేకు: 1971-6
సంపుటము: 29-366
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| వెలఁది చందములెల్లా విన్నవించితి మిదిగో తలఁపెరిఁగి మన్నించి దయఁజూడు మిఁకను | ॥పల్లవి॥ |
| చెలులతో నీ కతలు చెప్పి గొంత తనివొందు తలపోఁతలనుఁ గొంత తమకమార్చు కలలోన నీ రూప గని సంతసించుకొను కలికిఁ గాఁగిట నెపుడు గలసేవోకాని | ॥వెలఁ॥ |
| పొదలి నీ కెదురు చూపులఁ గొంత చెలరేఁగు కదియు రతి వేడుకలఁ గాఁకలార్చు ముద మలర నీ పదంబులు వాడి మది గరఁగు ఇది యెరిఁగి చన వెటుల నిచ్చేవోకాని | ॥వెలఁ॥ |
| నిను బయలు గాఁగిటను నించి కొంతపొద్దు జరపు వినుకలినిఁ దనలోని విరహ ముడుపు యెనసితివి శ్రీవేంకటేశ యలమేల్మంగను ననుపులిఁక నెటువలెను నడపేవోకాని | ॥వెలఁ॥ |


