శృంగార సంకీర్తన
రేకు: 1973-1
సంపుటము: 29-373
రేకు: 1973-1
సంపుటము: 29-373
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| చిన్నదానఁ జెప్పేనంటే సిగ్గయ్యీ నాకు తన్నుఁ దానే తెలుసుక దక్కి వుండు మనవే | ॥పల్లవి॥ |
| సొలపుఁజూపుల తొల్లి చూచినచుట్టురికము పలుమారు నెడతాఁకి పాయని చుట్టరికము తలపోఁతలనే కడు దక్కిన చుట్టరికము కలదు తనకు నాకుఁ గరుణించు మనవే | ॥చిన్న॥ |
| మాఁటలనే మరిగిన మచ్చిక చుట్టరికము నాటుకొన్న వలపుల నమ్మిన చుట్టరిము తేటల సరసముల తెగని చుట్టరికము పూఁట వూఁట కిట్లానే పొదలించు మనవే | ॥చిన్న॥ |
| యెనసిన కాఁగిళ్ళలో హెచ్చిన చుట్టరికము మనసు మర్మములనే మాఁగిన చుట్టరికము తన దేవి నలమేల్మంగను తానే శ్రీవేంకటేశుఁ డొనర నన్నేలె నింకాఁ జనవు లిమ్మనవే | ॥చిన్న॥ |


