Display:
శృంగార సంకీర్తన
రేకు: 1974-1
సంపుటము: 29-379
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఇన్నిటా మంచిదానవు యీతని నొరయనేలే
మిన్నక సేవలు సేసి మెప్పించవలెఁ గాకా
॥పల్లవి॥
చక్కెర వంటిది మోవి జవ్వాదివంటిది తావి
జక్కవలఁ బోలును చన్నులు నీవి
వెక్కసా లే లాడేవే విభుఁడు చెనకెనంటా
చొక్కుచు వినయములే చూపవలెఁగాక
॥ఇన్ని॥
చిగురువంటిది మేను సింగమువంటిది కౌను
మొగము చంద్రకళల మూఁకలనాను
బిగియుచు దూరనేలే పెనుఁగొప్పు ముట్టెనంటా
జిగిమించఁ బ్రియాలెల్లాఁ జెప్పవలెఁగాకా
॥ఇన్ని॥
పుత్తడివంటిది రూపు పూవులవంటిది చూపు
గుత్తపుఁ బిరుఁదు కరికుంభాల దాపు
వొత్తనేలే శ్రీవేంకటోత్తముఁడు గూడె నంటా
పొత్తుల నీతని మేలు పొగడవలెఁగాకా
॥ఇన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము