Display:
శృంగార సంకీర్తన
రేకు: 1974-4
సంపుటము: 29-382
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
ఆతఁ డెంత నీ వెంత అమ్మరో నీవు
చేతులెత్తి మొక్కు మొక్కి సేవ సేయఁ గదవే
॥పల్లవి॥
మెలఁగి యాతఁడు నీకు మిక్కిలి వలచునంటా
కలికితనాల నెంత గయ్యాళించేవే
కలకాలము నీతోనే కాఁపురము సేసెనంటా
నలి రేఁగిరేఁగి యేమి నవ్వు నవ్వేవే
॥ఆతఁ॥
చెంది నీ చనువు లెల్లాఁ జెల్లించీనంటాను
మందె మేళమున నెట్టు మాఁటలాడేవే
సందడించి నీ యింటికి సారెకు వచ్చీనంటా
గొంది నుండి యేల రాకొట్టు గొట్టేవే
॥ఆతఁ॥
యెనసి యాతఁడు నిన్ను నెగ్గు లెంచఁ డంటాను
పెనఁగి యేఁటికి మోవి పిప్పి సేసేవే
వినయాన నితఁడే శ్రీవేంకటేశుఁడు నిన్నేలె
గొనకొని యెందాఁకాఁ గోరి కొసరేవే
॥ఆతఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము