Display:
శృంగార సంకీర్తన
రేకు: 1977-3
సంపుటము: 29-399
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఎన్ని నోములు నోఁచితి నీతనికిఁ జెలియా
సన్నలా చాయలా నీకే సతమైనాఁడు
॥పల్లవి॥
తరుణి నీ తలఁచిన తలఁపు నీడేరెనే
వరుసతో విటుఁడు నీవాఁడాయను
సిరుల నీ చనవులు చెల్లించుకొంటివే
యెరవులే కితఁడు నీ యింటనే వున్నాఁడు
॥ఎన్ని॥
సేసిన నీ చేతఁలు చెల్లుబళ్లాయనే
సేసవెట్టి నీ మగఁడు సేవగొనెను
వాసితో నీ వలచిన వలపు రతికెక్కెనే
ఆసయిచ్చి నిన్నీతఁడు అన్నిటా మన్నించెను
॥ఎన్ని॥
కోరిన నీ కోరికలు కొనసాగి మించెనే
యీరీతి శ్రీవేంకటేశుఁ డిట్టె నిన్నేలె
తారుకాణై నీ చక్కఁదనము ఫలించెనే
మేర మీర కితఁడు నీమీఁద బత్తిగలఁడు
॥ఎన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము