శృంగార సంకీర్తన
రేకు: 1977-6
సంపుటము: 29-402
రేకు: 1977-6
సంపుటము: 29-402
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
| ఇన్నిటాఁ గనుఁగొంటిమి ఇంతి నీపైఁ గల బత్తి వెన్నెల తేటనవ్వుల వెలయించే దెపుడో | ॥పల్లవి॥ |
| పొంగఁ బొంగఁ బొంగులాయ పొలఁతి కోరిక లవి అంగడి బేరాలాయ నడియాసలు ముంగిటి ముగ్గులాయ మునుకొన్న సిగ్గులు అంగనను దయఁజూచి యాదరించే దెపుడో | ॥ఇన్ని॥ |
| చూడఁ జూడఁ బౌఁజులాయ సుదతి కను చూపులు వొడఁగట్టు దలాలాయ వొడఁబాటులు వీడెపు బుక్కిళ్లాయ వినుకలి విరహాలు యీడులేని జవరాలు నేలే దిఁక నెపుడో | ॥ఇన్ని॥ |
| ఊర నూర నూటులాయ నువిద తమకములు గోర గీర నేరులాయ కూరిములు యీరీతి శ్రీవేంకటేశ యీకె నిట్టె కూడితివి తారుకాణ నీ మాఁటలు తలఁపించే దెపుడో | ॥ఇన్ని॥ |


