Display:
శృంగార సంకీర్తన
రేకు: 1978-6
సంపుటము: 29-408
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
నీ నేరుపేటిదే నిన్నుఁ జూచి వెరగయ్యీ
కానీవే నిన్నెఱుఁగుదు గడుసరిదానవే
॥పల్లవి॥
నడుమ నీ వూరకె నా మగనితోడుత -
నెడమాఁట లాడించే వెంతదానవే
వడిగా బువ్వలచెండు వాటుగా నాతని వేసి
కడు సన్నసేసే వెంత గయ్యాళిదానవే
॥నీ నేరు॥
వింతగా నాతఁడూ నేనూ వినోదము లాడఁగాను
వంతులకు వచ్చే వెంటువంటిదానవే
మంతన మాడుతాఁ దెరమాఁటునఁ గూచుండఁగాను
రంతుసేసే వేనాటి రట్టడిదానవే
॥నీ నేరు॥
యీకడ శ్రీవేంకటేశుఁ డిటు నాతో నవ్వఁగాను
పైకొనఁ జూచేవు నీ వేపాటిదానవే
కైకొని నలమేల్మంగ నెదపై నుండఁగాను
జోకతోఁ జెనకే వేమి జూటుదానవే
॥నీ నేరు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము