Display:
శృంగార సంకీర్తన
రేకు: 1980-2
సంపుటము: 29-416
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదరామక్రియ
నీ కొలఁది గాదు గదె నీ చేఁతలు
యీ కడ నీ దంటతనా లెక్కుడాయఁ గదవే
॥పల్లవి॥
కాచియుఁ గావవు నీ చక్కని చన్నులు
పూచియుఁ బూవవు నీ పూఁప నవ్వులు
చూచియుఁ జూడదు చౌల సొంపు నీ మోవి
యేచి యిసుమంతదాన వెంత నేరిచితివే
॥నీకొల॥
కూడియుఁ గూడవు నీ కొప్పు విరులు
వీడియు వీడవు నీ వెడ సిగ్గులు
ఆడియు నాడని వీ వొయ్యారి మాటలు
యీడు లెట్టుకొని నాతో నేల పెనఁగేవే
॥నీకొలఁ॥
తనిసీఁ దనియదు చిత్తము రతుల
మొనసీ మొనయపు నీ మొన గోరులు
యెనసె శ్రీవేంకటేశుఁ డింతలో నన్ను
ననిచి యీతని నేల నంటుసేసుకొనేవే
॥నీ కొలఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము