Display:
శృంగార సంకీర్తన
రేకు: 1980-6
సంపుటము: 29-420
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: హిందోళవసంతం
ఎందాఁకా నీతని రాక లెంచి కాచుకుండితివి
చందమాయఁ బనులెల్లా సంతోసించవే
॥పల్లవి॥
చెలువుఁడు వచ్చెనంటాఁ జెప్పీ గూఁటిలో చిలుక
యెలమి నిట్టె నీవు యెదురుకోవే
నిలువుటద్దానఁ బతి నీడ యిదె కానవచ్చీ
పిలిచి వినయముతోఁ బీఁట వెట్టవే
॥ఎందాఁ॥
మచ్చికఁ జెలికత్తెలు మాఁటలాడే రాతనితో
విచ్చన విడి నీ వూను వినఁగదవే
వచ్చి కూచుండఁగా మోసీ వడి సకినల మంచ
మిచ్చట విడె మియ్యవే మీతనికి నీవు
॥ఎందాఁ॥
యిదె శ్రీవేంకటేశ్వరుఁ డిన్నిటాను నిన్నుఁగూడె
వుదుటు రతుల నింక నోల లాడవే
కదలి సూత్ర బొమ్మలు కమ్మి సురట్లు విసరీ
పెదవి తేనియ లాని ప్రియములు రేఁచవే
॥ఎందాఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము