Display:
శృంగార సంకీర్తన
రేకు: 1981-1
సంపుటము: 29-421
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
సొరిది నే మిందరము సోబానఁ బాడేము
బెరసి యీతని నీవు పెండ్లాడవే
॥పల్లవి॥
చెక్కులఁ జెమట గారె సెలవుల నవ్వు దేరె
మక్కువ నీ వీతనితో మాఁటలాడఁగా
తక్కక నీ వలపులు దాఁచ నిఁక నేమిటికి
పెక్కులేల వేడుకతోఁ బెండ్లాడవే
॥సొరి॥
తనువెల్లాఁ బులకించె తలపోఁత లిగిరించె
మోనసి నీ వీతని మోము చూడఁగా
అనిశము నీ కోరిక లణఁచఁగ వలదిఁక
పెనగొన్న వేడుకతోఁ బెండ్లాడవే
॥సొరి॥
ముంచి మోవిపండు మాఁగె ముక్కుననూర్పులు రేఁగె
పొంచి శ్రీవేంకటేశుఁడు పొందుసేయఁగా
కొంచక మీ కూటములు గుట్టుసేయ నిఁక రాదు
పెంచిన వేడుకతోఁ బెండ్లాడవే
॥సొరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము