Display:
శృంగార సంకీర్తన
రేకు: 1982-4
సంపుటము: 29-430
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఎన్ని నేరుచుకొంటివే యివీఁ గొన్ని
పన్నుకొన్న జాడలు పచ్చిదేరె నిపుడు
॥పల్లవి॥
చెలిమైతేఁ జెటెఁడేసి చిగిరునవ్వు మూటెఁడేసి
జలిమి నెంత చల్లేవే పతి మీఁదను
వలపులు గంపెఁడేసి వాడికలు గుంపెఁడేసి
వెల పరచ వచ్చేవు వింతలే నీ సుద్దులు
॥ఎన్ని॥
తాలిములు మూరెఁడేసి తలఁపులు బారఁడేసి
గారి గఁటు వేసేవే కమ్మటి నీవు
మేలములు బండెఁడేసి మెచ్చులైతే కుండెఁడేసి
చేలలో వెదవెట్టేవు చెల్లునే నీ చేఁతలు
॥ఎన్ని॥
సంగాతాలు పట్టెఁడేసి సణఁగులు గొట్టెఁడేసి
జంగిలేల కల పేవే సారె సారెకు
అంగవించి శ్రీవేంకటాద్రీశుఁడు నన్ను నేలె
యెంగిలి పొత్తేల కూడే వీతనితో నీవు
॥ఎన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము