Display:
శృంగార సంకీర్తన
రేకు: 1983-5
సంపుటము: 29-437
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఎన్నిలేవు పనులు నీ కెంచుక సేసేనంటే
మన్నింతువుగాక జోలి మరి యేలయ్యా
॥పల్లవి॥
పలుకు దేనెల మోవి పచారించి వేఁడుకొనీ
చెలియ మనవు లింకఁ జేకొనవయ్యా
కొలువు లిందాఁకా జేసి కొసరి నిన్నుఁ బిలిచీ
యెలమి నీకె ఇంటికి రావయ్యా
॥ఎన్ని॥
చిగురుఁ జేతుల నిన్ను చెయివట్టి పెనఁగీని
మగువ చేఁతలకు సమ్మతించవయ్యా
మొగము చూచి నీకు మెక్కులెల్లా మొక్కీని
అగపడి యీకె చెప్పినట్టు సేయవయ్యా
॥ఎన్ని॥
కుంకుమ గుబ్బల నిన్నుఁ గుచ్చి కాఁగిలించుకొనీ
లంకెలఁ బాయక ఇఁక లాలించవయ్యా
తెంకికి నిన్నుఁబిల్చి తెరవేసుకొనె నీకె
అంకెల శ్రీవేంకటేశ ఆదరించవయ్యా
॥ఎన్ని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము