Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 24-6
సంపుటము: 1-148
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
[1]ఉప్పవడము గాకున్నా రిందరు
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు
॥ఉప్ప॥
కన్నుల చంద్రుఁడును కమలమిత్రుఁడును
వున్నతి నివి నీకుండఁగను
వెన్నెల యెండలు వెలయఁగ మేల్కొను-
టెన్నఁడు నిద్దర యెన్నఁడు నీకు
॥ఉప్ప॥
కందువ సతి కనుఁగలువలు ముఖార-
విందము నిదివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన
విందగు నీతెలివికిఁ దుద యేది
॥ఉప్ప॥
తమము రాజసము తగు సాత్వికమును
నమరిన నీ మాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను
ప్రమదము మఱపునుఁ బైకొనుటెట్లా
॥ఉప్ప॥

[1] ఇది ఒకపాటి శృంగారకీర్తనల ఛాయలోనిది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము