Display:
శృంగార సంకీర్తన
రేకు: 1984-3
సంపుటము: 29-441
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
పట్టెఁడేసి గుబ్బల పాయపుదానవు నీవు
దిట్టవై రతుల నిట్టె తేలించఁగదవే
॥పల్లవి॥
మచ్చరమే వద్దుగాని మాఁటల దూరఁగవచ్చు
కుచ్చితమే వద్దుగాని కొసరవచ్చు
వచ్చె పట్టవద్దుగాని వొరసి జింకించవచ్చు
ఇచ్చట నీతనిఁ జూచి ఇన్నటి మెరయవే
॥పట్టెఁ॥
వుప్పతించవద్దుగాని వొడివట్టి తియ్యవచ్చు
చొప్పులెత్తవద్దుగాని సొలయవచ్చు
తప్పులెంచవద్దుగాని తగిలి గుంపించవచ్చు
యిప్పు డీతని ముందర నిన్నిటా మెరయవే
॥పట్టెఁ॥
యెలయించవద్దుగాని హెచ్చి కాఁగిలించవచ్చు
చలపట్టవద్దుగాని సాదించవచ్చు
వెలయఁగ నిన్నిట్టె శ్రీవేంకటేశుఁడు గూడె
యెలమి నీతని చెంత నిన్నిటా మెరయవే
॥పట్టెఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము