Display:
శృంగార సంకీర్తన
రేకు: 1985-4
సంపుటము: 29-448
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
తన కెదురాడేనా తన మేలుదాన నేను
మనలో నొరయనేల మన్నించమనవే
॥పల్లవి॥
చెప్పఁ జెప్పఁ గొత్తలాయ చేరి తన సుద్దులెల్లా
అప్పుడే నే వింటిని రమ్మనవే నీవు
వుప్పుచిం దినుమడాయ వొద్దనేనా యెట్ల్తెనా
తప్పు లెంచఁ జనిలేదు తనిసితి నేను
॥తన॥
చూడఁ జూడ సోద్యమాయ సొరిది దన చేఁతలు
యీడనుండే కంటి నిఁక నేమీ నననే
వేడుకకు వెలలేదు వెంగెమాడేదానగాను
గోడలేని చిత్తఱువు కొసరేనా నేను
॥తన॥
సేయఁ జేయ రాసులాయ చెల్లెఁ దన వలపులు
పాయక నే నియ్యకొంటిఁ బదరనేలే
ఱాయి గిలిగించితేను ఱట్టౌ శ్రీవేంకటేశుఁ -
డీయడ నన్నేలినాఁడు యెరిఁగితి నేను
॥తన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము