Display:
శృంగార సంకీర్తన
రేకు: 1985-5
సంపుటము: 29-449
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
మఱి నీవే కరుణించి మన్నించితి వింతేకాక
గుఱుతులు చెప్పి నిన్నుఁ గొసరఁగఁగలమా
॥పల్లవి॥
వెలఁది భావము నీకు విన్నవించితిమిగాక
వలపులు గొనఁబెట్ట వసమా మాకు
తలకొన్న నేస్తముల తగవు చెప్పేముగాక
చెలరేఁగి తమి రేఁచఁ జెల్లునా మాకు
॥మఱి॥
తరుణి లోనన్నమాఁట తలఁపించితిమిగాక
సరసము లాడించ సంగతే మాకు
సరుస మీ కిద్దరికి సాకిరై వుండేముగాక
సొరిది మీ గుట్టు చెప్పఁ జొప్పడునా మాకు
॥మఱి॥
యింతి జుట్టరికము నీ కెరిఁగించితిమిగాక
వంతున సరి వెనఁగవచ్చునా మాకు
యింతలో శ్రీవేంకటేశ యీకె నేలితివిగాక
పొంత మిమ్ము సోదించఁబోలునా మాకు
॥మఱి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము