Display:
శృంగార సంకీర్తన
రేకు: 1986-4
సంపుటము: 29-454
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
ఒక్కచోటనే వున్నారు వొద్దిక నాతఁడూ నీవూ
చెక్కుల చేతులతోడ చింత లిఁక నేఁటికే
॥పల్లవి॥
మనసు లొడఁబడితే మాఁటలకుఁ జోటు గద్దు
తనువులు సోఁకితేను తమి రేఁగును
చెనకు లగ్గలమైతే సిగ్గులును నుప్పతిలు
చనవు సేసుక పతి సంగాతాలు సేయవే
॥ఒక్క॥
మొగమొగాలు చూచితే మోహములు పెనగొను
నగవులు వలపుల నానఁబెట్టును
తగులాయపుఁ జేఁతలు తాలిములు వొడమించు
వెగటులే కితనితో వినోదము లాడవే
॥ఒక్క॥
అలమి పైకొంటేను ఆయములు గరఁగును
తలపోఁత కోరికలు తనివొందించు
యెలమి శ్రీవేంకటేశఉఁ డింతలోనె నిన్నుఁ గూడె
నెలకొనె నీ పంతాలు నిండుక వుండఁగదే
॥ఒక్క॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము