Display:
శృంగార సంకీర్తన
రేకు: 1987-4
సంపుటము: 29-460
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
మచ్చిక గలిగితేనేమి మరఁగు వద్దా
పచ్చిదేర నేమిటికి బయలీఁదేవే
॥పల్లవి॥
కొలువు లోపల మోము కొచ్చి కొచ్చి చూచుకొంటా
మలసి సొలసి యేమి మాఁటలాడేవే
నలి నీ యెమ్మెలు చూచి నవ్వేవారి నెరఁగవు
యెలమి నీ పగటులు యెంత చూపేవే
॥మచ్చి॥
పొట్టఁబొరుగున నుండి బొమ్మల జంకించుకొంటా
ఇట్టె బీరాన నెంత యెలయించేవే
చుట్టుకొన్న వలపుల సుద్దులు దలఁచుకోవు
చుట్టరికాలనే యెంత సూడువట్టేవే
॥మచ్చి॥
సంగడివే కూచుండి చన్నుల నొరసుకొంటా
యెంగిలి మోవినే యెంత యింపురేఁచేవే
చెంగటనే నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు
ముంగిట నీ యాస లెన్ని మొలవఁ బెట్టేవే
॥మచ్చి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము