Display:
శృంగార సంకీర్తన
రేకు: 1988-6
సంపుటము: 29-468
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
ఇంకా నేమి సేసీనో ఇది నీ కెంత ప్రియమో
పొంకముగాఁ జూచి చూచి పొగడేము నేము
॥పల్లవి॥
గుత్తపు గుబ్బల నొత్తి గోరు చెక్కుపైఁ బెట్టి
చిత్తమురా నీకు సేవ సేసెఁగా తొల్లె
తత్తరాన నిందుమీఁద తన మోవి తేనె యిచ్చి
బత్తు లెల్లాఁ జూపెగా నీ పై నీపె నేఁడు
॥ఇంకా॥
మేడలోనఁ గాలు దొక్కి మెడదండ నీపై వేసి
జోడుగా జుట్టరికాలు చూపెఁగా తొల్లె
వేడుకతో నప్పటిని వెంటికలు దాఁక మొక్కి
కూడి పొత్తు గలపెఁగా కోరి నీతో నిపుడు
॥ఇంకా॥
తొడమీఁదఁ గూచుండి దొమ్మినిఁ గాలు దాఁకించి
చిడుముడిఁ జేఁతలెల్లాఁ జెసెఁగా తొల్లె
అడరి శ్రీవేంకటేశ యలమేలుమంగను నేను
తడవి నన్నేలితివి తా మెచ్చెఁగా ఇందుకు
॥ఇంకా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము