Display:
శృంగార సంకీర్తన
రేకు: 1991-3
సంపుటము: 29-483
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఎంతలేదు నీ యాసోద మేమి చెప్పేది
వింత వింత రతులనే వినోదించేవు
॥పల్లవి॥
యెడమాఁటలాడేటి ఇంతితో సారెసారెకు
తడవి తడివి జాణతనా లాడేవు
కడనుండి వేరొకతె కానుకియ్య వచ్చితేను
నడుమ నూరకె నీవు నవ్వునవ్వేవు
॥ఎంత॥
పేరటమువచ్చి నాపె పెండ్లిపాట వాఁడగాను
కూరిమి గొసరి యేల కొంగువట్టేవు
నేరుపుతోడ నొకతే నీవేడుక చూడఁగాను
పోరచి వలపు చల్లి పువ్వుల వేసేవు
॥ఎంత॥
సాకిరై వచ్చినయట్టి సతి వద్ద నుండఁగాను
మేపులకు సాపెతోను మేలమాడేవు
యీకడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
పై కొసరువారి కేల బాఁతిపడేవు
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము