Display:
శృంగార సంకీర్తన
రేకు: 1991-5
సంపుటము: 29-485
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఎంతని చెప్పీ మిఁక ఇంతి నీపైఁ గల బత్తి
పొంత నీ చక్కఁదనాలు పూఁచి పూఁచి వా(వ్రా?)సును
॥పల్లవి॥
తరుణి నీతో పొందు తలఁచుక తలఁచుక
గరివతో నాడుకొను కాంతలతోను
సొరిది నీ గురుతులు చూచుకొని
వెరగంది పలుమారు వేడుకతో నవ్వును
॥ఎంత॥
జలజాక్షి నీ గుణాలు సరిఁ బొగడి పొగడి
చెలరేఁగి మేనెల్లాఁ జెమరించును
యెలమి నీ మన్ననలు యెంచుకొని యెంచుకొని
నిలువుఁ బులకలతో నిట్టూరుపు నించును
॥ఎంత॥
కొమ్మ నీపై వలపుల గబ్బతిలి గుబ్బతిలి
ఇమ్ముల నీకుఁ జేతులెత్తి మొక్కును
నెమ్మది శ్రీవేంకటేశ నీవు వచ్చి కూడితివి
కమ్మి యీకె సంతోసాన గడు నోలలాడను
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము