Display:
శృంగార సంకీర్తన
రేకు: 1994-2
సంపుటము: 29-500
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
వేసరకు చెలియా వేగమె వచ్చీ నాతఁడు
ఆసల దానే నిన్ను నాదరించీఁ గాని
॥పల్లవి॥
వెలవెట్టి కొంటే రాదు వేడుకైన వలపు
తలఁపు కొలఁదినే తగులుఁగాని
బలిమికి లోఁగాదు బాఁతియైన వలపు
చెలఁగి మంచిమాఁటల చేకూడుగాని
॥వేస॥
పట్టి తీసితే నబ్బదు బాగైన వలపు
చుట్టపు వరుసనే సొగియుఁగాని
బట్టబయటను లేదు పాదుకొన్న వలపు
దట్టపు వినయాలనే తలకొనుఁగాని
॥వేస॥
వొడిఁబెట్టితే నుండదు వుదుటైన వలపు
వుడివోని రతులనే వొద్దికౌఁగాని
యెడయక శ్రీవేంకటేశుఁ డిదె నిన్ను నేలె
విడువ కిట్ల నుంటే వినోదయౌఁగాని
॥వేస॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము