అధ్యాత్మ సంకీర్తన
రేకు: 279-3
సంపుటము: 3-455
రేకు: 279-3
సంపుటము: 3-455
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
| ఒక్కమాటు శరణుని వుండేనింతే కాక పెక్కు విధముల నెట్టు పెనఁగేనయ్యా | ॥పల్లవి॥ |
| నాలికె వొక్కటే నీ నామము లనంతము పోలించి నే నిన్నెట్టు పొగడేదయ్యా వోలి నాకన్నులు రెండే వొగి నీ మూర్తులు పెక్కు సోలి నే నిన్నెటువలెఁ జూచెదనయ్యా | ॥ఒక్క॥ |
| వట్ట నా చేతులు రెండే పదములు నీకుఁ బెక్కు వొట్టి నిన్నుఁ బూజించ నోపికేదయ్యా గట్టి నాచెవు లిసుమంత కథలు నీకవియెన్నో పట్టపు నేనెట్టు విని భజియించేనయ్యా | ॥ఒక్క॥ |
| యేమిటాఁ జిక్కవు నీవు యింత దేవుఁడవుగాన కామించి నీడాగు మోచి గతిగ నేను యీ మేర శ్రీవేంకటేశ నీవే నన్నుఁ గావు దీమసాన నిఁక వేరేతెరువు లేదయ్యా | ॥ఒక్క॥ |


