శృంగార సంకీర్తన
రేకు: 1994-3
సంపుటము: 29-501
రేకు: 1994-3
సంపుటము: 29-501
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఉల్లములో తలపోఁత నోలలాడుచున్నదాన వెల్లవిరిగాఁ జెప్పవే వేడుకయ్యీఁ జెలియా | ॥పల్లవి॥ |
| వచ్చునొకో ఆతఁడు నా వాకిటికి నెప్పుడైనా మెచ్చునొకో నాతోను మేలము లాడి యిచ్చునొకో చనవు నా కిందరిలో నా నేఁడు హెచ్చెఁ గోరికలు నాలో నేముందునే చెలియా | ॥ఉల్ల॥ |
| కందునొకో యాతనిఁ గన్నులయెదుట నేను విందునొకో మాఁటలు వీనులారను పొందునోకో నాకాఁగిట బుజ్జగించి ఇట్టె తాను సందడించీఁ దమకమెంచఁగరాదే చెలియా | ॥ఉల్ల॥ |
| యెక్కునొకొ నా సేవ లిన్నియును నాతనికి చొక్కునొకొ నా రతుల సులభానను దక్కునొకొ యనఁగానే తానె శ్రీవేంకటేశుఁడు ఇక్కడికె విచ్చేసి యేలె నన్నుఁ జెలియా | ॥ఉల్ల॥ |


