Display:
శృంగార సంకీర్తన
రేకు: 1996-1
సంపుటము: 29-511
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
నంటున నిన్ను మరిగె నా మనసు
జంటలాయ నిద్దరికి సరియాయ మనసు
॥పల్లవి॥
చిగిరింపుఁ గోరికల చిమ్మిరేఁగె వలపు
మొగము చూపులవల్ల మోసులెతై మనసు
తగులువిరిమాఁటలఁ దగులాయ మనసు
నగవుల సరసాల ననుపాయ మనసు
॥నంటు॥
కొనగోరి చెనకుల గుదిగొనె మనసు
వినయపు చేఁతలనే వియ్యమందె మనసు
పెనగొన్న యాసలనె పిక్కటిల్లె మనసు
యెనసే తమకమున యేపురేఁగె మనసు
॥నంటు॥
పల్లదపుమనమున పచ్చిదేరె మనసు
వెల్లవిరి సన్నలనె వెలసెను మనసు
యెల్లగా శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
వుల్లపు సంతోసాన వుప్పతిల్లె మనసు
॥నంటు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము