అధ్యాత్మ సంకీర్తన
రేకు: 279-5
సంపుటము: 3-457
రేకు: 279-5
సంపుటము: 3-457
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| వేళ లేదు జాడ లేదు వీని తోడిదే పాటు కూళఁడనై తిరిగేను గుణమేది నాకు | ॥పల్లవి॥ |
| వేగిరించి పెరరేఁచి వేసరించీఁ బనులు సాగి ముందరఁ బొలసి చలపట్టీ సిరులు జాగు సేసి వచ్చి వచ్చి చవి చూపీఁ బాయము యేగతి నిన్నుఁ దలఁతు నేది బుద్ధి నాకు | ॥వేళ॥ |
| తన్నుఁదానే వచ్చి వచ్చి తగిలీ లంపటము వున్నతి భోగముల నోరూరించీ సుఖము కన్నచోనే యెలయించి కదిమీ సంసారము యెన్నఁడు నిన్నుఁ దలఁతు నెఱుకేది నాకు | ॥వేళ॥ |
| తాలిమితో మీఁద మీఁదఁ దరవయ్యీఁ గర్మము నాలితోడ సన్నసేసి నవ్వు నవ్వీ మర్మము యేలితివి శ్రీవేంకటేశ్వరుఁడ నన్ను నీవు సీలాన నీ వాఁడనైతిఁ జెప్పనేది నాకు | ॥వేళ॥ |


