Display:
శృంగార సంకీర్తన
రేకు: 2000-5
సంపుటము: 29-539
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
చూడఁ బిన్నదానవు సుద్దులు కోటానఁగోటి
వేడుకతో నీ విభుఁడు వెరగందెఁ గదవే
॥పల్లవి॥
దవ్వులనుండే మొక్కలు తలపోఁత చొక్కులు
నివ్వటిల్ల నెన్నఁ డివి నేరిచితివే
పువ్వుల వేసే వాట్లు పొట్టఁబొరుగునీట్లు
మువ్వంక నీ పతి చూచి మోహించెఁగదవే
॥చూడఁ॥
కడకంటి చూపులు కడుఁ దరితీపులు
వెడవెడగా నెంత వెద చల్లేవే
చిడుముడి మరఁగులు చెమటల కరఁగులు
బడినే నీ పతి చూచి పాయలేడుగదవే
॥చూడఁ॥
కావరపు మాటలు కాఁగిటి రతి తేటలు
లావుగా నెంతేసి కలయఁబెట్టేవే
మోవిపై పలు సోఁకులు మొనగోరి తాఁకులు
శ్రీవేంకటపతి చూచి చేరి కూడెఁగదవే
॥చూడఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము