Display:
శృంగార సంకీర్తన
రేకు: 2001-4
సంపుటము: 29-544
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఏడనుండి వచ్చితివే యీడకు నీవు
వాడిక సేసుక యేమి వద్దఁ గూచుండేవే
॥పల్లవి॥
పవ్వళించియున్నవాని పాటలు వాడి లేపి
యివ్వల నూరకే యెంత యెలయించేవే
దివ్వెలెత్తుఁ బొద్దుకాడ తెరలోననున్నవాని
రవ్వఁగా బిలిచి చదరంగా లేమాడేవే
॥ఏడ॥
ఆకడి మోమైనవాని నట్టె చెక్కునొక్కి తీసి
కాకరి మాఁటల నేమి కత చెప్పేవే
నాకడనుండినవాని నవ్వు నవ్వి కొనగోర
రేక దీసి తమి యెంత రేఁచవచ్చేవే
॥ఏడ॥
అలసియున్నవాని నట్టె కౌఁగిలించుకొని
మలసి మోవిచ్చి యెంత మరిగించేవే
యెలమి శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁగూడె
వలపులు రేఁచి యేమి వావులు చెప్పేవే
॥ఏడ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము