Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 138 సంకీర్తన: 140
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 12
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: గుజ్జరి
అయ్యో! యేమరి నేనాఁడప్పుడేమై వుంటినో
అయ్యడ నీ దాసినైతే ఆదరింతుగా
॥పల్లవి॥
అల్లనాఁడు బాలుఁడవై ఆవులఁ గాచేవేళ
చిల్లరదూడనైతే చేరి కాతువుగా
వల్లెగా విటుఁడవై రేపల్లెలో నుండేనాఁడు
గొల్లెత నయినా నన్ను కూడుకొందుగా
॥అయ్యో॥
మేలిమి రామావతారవేళ రాయి రప్పనైనా
కాలు మోపి బదికించి కాతువుగా
వాలి సుగ్రీవులవద్ద వానరమై వుండినాను
యేలి నన్నుఁబనిగొని యీడేర్తువుగా
॥అయ్యో॥
వారిధిలో మచ్చ కూర్మావతారము లైననాఁడు
నీరులో జంతువునైనా నీవు గాతువుగా
యీ రీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టే
మోరతోపున నిన్నాళ్లు మోసపోతిఁగా
॥అయ్యో॥

(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 6వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము