Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 189 సంకీర్తన: 197
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 17
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
అలరఁజంచలమైన ఆత్మలందుండ నీయలవాటు సేసె నీవుయ్యాల
పలుమారు [1]నుచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు దెలిపె నీవుయ్యాల
॥పల్లవి॥
ఉదయాస్తశైలంబు లొనరఁ [2]గంభములైన వుడుమండలము మోఁచె నుయ్యాల
అదన నాకాశపద మడ్డదూలంబైన అఖిలంబునిండె నీవుయ్యాల
పదిలముగ వేదములు బంగారుచేరులై పట్టవెరపై తోఁచె నుయ్యాల
వదలకిటు ధర్మదేవత పీఠమై మిగుల వర్ణింప నరుదాయ నుయ్యాల
॥అలర॥
మేలుకట్లయి మీకు మేఘమండలమెల్ల మెఱుఁగునకు మెఱుఁగాయ నుయ్యాల
నీలశైలమువంటి నీమేని కాంతికిని నిజమైన తొడవాయ నుయ్యాల
పాలిండ్లు గదలఁగాఁ బయ్యదలు రాఁపాడ భామినులు వడినూఁచు నుయ్యాల
వోలి బ్రహ్మాండములు వొరగునోయని భీతి నొయ్యనొయ్యన వూఁచి రుయ్యాల
॥అలర॥
కమలకును భూసతికి కదలుకదలుకు మిమ్ముఁ గౌఁగిలింపఁగఁజేసె నుయ్యాల
అమరాంగనలకు నీ హావభావ విలాసమందంద చూపె నీ వుయ్యాల
కమలాసనాదులకుఁ గన్నులకు పండుగై గణుతింప నరుదాయ నుయ్యాల
[3]కమనీయమూర్తి వేంకటశైలపతి నీకు కడువేడుకై వుండె నుయ్యాల
॥అలర॥

(ఈ సంకీర్తన 1వ సంపుటంలో 67వ సంకీర్తనగా ఉంది.)

[1] ‘నుశ్వాస’ అనియే రేకు. ‘ఉయ్యాల’ పదము రేకునందంతటా ‘ఉయ్యాలా’ అనియే ఉన్నది.
[2] స్తంభము (ప్రకృతి) - కంబము (వికృతి). వ్రాతప్రతిలోను, రాగిరేకులోను ‘కంభం’ అని ఉండుటచే సరిదిద్దక అట్టే ఉంచితిమి.
[3] ‘కమనియ్య’ అని రేకు. నిడురేకు 11 లోని పాఠములు
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము