సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 55 సంకీర్తన: 54
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 56
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 55 సంకీర్తన: 54
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 56
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం - అట
| ఎటువంటివాఁడవో నీ మహిమ లెట్టు దెలియవచ్చును నిటలలోచనుఁడు అజుఁడు తెలియలేరు నిన్నెట్లు దెలిసేరు మానవులు | ॥పల్లవి॥ |
| తిరుమలనంబి తా తాత యన్ననాఁడె తెలిసెఁ బో మీ పెద్దతనములు కురువనంబిగారి చేతి బంకమట్టి పువ్వులు కొన్ననాఁడె తెలిసె మీ భోగము మఱియు ననంతాళువారి చెఱువు గట్ట మన్ను మోయఁగా దెలిసె మీ నటనలు గరుడగంభముకాడ కాసు కొక్కవరమిచ్చి గడియించఁ దెలిసె మీ సంపద | ॥ఎటువంటి॥ |
| తొండమాంజక్రవర్తికి సంపద తొలుత నియ్యఁగాఁ దెలిసె మీ యీవులు అండ యెఱుకువారి కొఱ్ఱచేని యెన్ను లారగించఁగాఁ దెలిసె మీ రుచులు వుండి గొల్లల కావిళ్ల పాలెల్ల వుట్టుకోఁగఁ దెలిసె మీ నేమములు దండిగ సంపంగిమాఁకుల నడిపించ దైవరాయ తెలిసె మీ విద్యలు | ॥ఎటువంటి॥ |
| మును దాసు తిమ్మన్న తుంబురుకొండకు మోక్షమియ్యఁగాఁ దెలిసె మీ బుద్ధులు పనివడి తాళ్లపాక అన్నమయ్యగారి పదములలోఁ దెలిసె మీ వోజలు యెనయ శ్రీవేంకటనాథ యలమేల్మంగ నెద నుంచఁగాఁ దెలిసె మీ గోప్యము వెనుకొని పరుషవారి కెదురువోయి వెంటరాఁగాఁ దెలిసె మీ రాజసము | ॥ఎటువంటి॥ |


