Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 179 సంకీర్తన: 185
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 68
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాదనామక్రియ
ఏటికని నే వగతునో ప్రా - ణేశుడు రానందుకా
సూటిమాటల కోర్వ - జాలని - సొగటాలాడేటందుకా
॥పల్లవి॥
పూర్వపుణ్య ఫలము కతననె - భూమి పుట్టినయందుకా
అర్వదీ నోములు నోచి నే జవ - రాల నయ్యేటందుకా
వుర్వివారెల్లా నా వయసు జూచి - వుప్పతిల్లేటందుకా
నీరజాక్షిరొ విభుడు నా యెడ - నేరమెంచేటందుకా
॥ఏటికని॥
ఆలియని వొకనాడు నన్ను - నాదరించని యందుకా
పాలవంటి మనసు నేటి - పాలు చేసేటందుకా
కాలయముడే (చేరి) నన్ను - గాసి చేసేటందుకా
కాలమెల్లా నలుక చేతనె - గడచిపోయేటందుకా
॥ఏటికని॥
చీమ చిటుకనగానె - జగడము సేసి పొయ్యేటందుకా
సీమలో గలవారు నన్ను - చెలగి నవ్వేటందుకా
(యేమి దూరుదు) వేంకటేశుని - యెడను బాసినందుకా
ప్రేమతో నలమేలుమంగను - పేర బిలచినందుకా
॥ఏటికని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము