Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 67 సంకీర్తన: 66
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 69
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఏటిపొందు యేఁటిగుణము యేటి సవరందనము మనసు
నాఁటుకొలుపం జేయలేని నటన లేఁటికే
॥పల్లవి॥
చూపు చూపు తారుకాణ చూపులోని నగవులెల్ల
చూపి పులకరించలేని సొబగు లేఁటికే
యేఁపు రేఁగి కోరికలకు యెత్తు సేసి మీఁదమీఁద
తాప మందఁజేయలేని తనువు లేఁటికే
॥ఏటి॥
కదిసినపుడే మేను మఱచి కౌఁగిలించినట్టి చేయి
వదలి కన్ను ముయ్యలేని వలపు లేఁటికే
తుదలనైన చెమటగముల తొప్పఁదోఁగి మోహరతుల
సదమదముగఁ దనుపలేని చనవు లేఁటికే
॥ఏటి॥
దేహధారియైన ఫలము తెలిసి వేంకటాద్రివిభుని
మోహమందఁ జేయలేని మురిప మేఁటికే
ఊహ దలఁచి తమక మంది వొకరి కొకరు యిట్ల నేఁడు
సాహసించి కలయకున్న జన్మ మేటిఁకే
॥ఏటి॥

(ఈ సంకీర్తన 6వ సంపుటంలో 180వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము