Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 262 సంకీర్తన: 277
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 84
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము - అట
ఏ వూరికేవూరు యెక్కడికి నెక్కడ
నీవు మాకు నిఁకనేల నిజమైనాఁ జెప్పరా
॥పల్లవి॥
అద్దమరాతిరిదాఁకా నందునిందు నుండివచ్చి
వద్దువోరా నీకునింత వలసినొల్లములు
నిద్దుర గంటికి లేక నీకునుండ వారమా[1]
వొద్దిక చాలని వారముండినా నుండితిమి
॥ఏ॥
వేకమైన పరితాప వేదనఁ బొరలలేక
కాఁక పుట్టి తిరిగేవు కన్నుగానలేక[2]
యేఁకట దీర నీకు నెందరు గలరని[3]
వోఁకల పులుసు కలువులఁ బుచ్చవలెనా[4]
॥ఏ॥
అందఁగాఁడ తిరువేంకటాద్రీశ పెక్కిండ్ల-
విందవై[5] నీవొ(కొ?)కతెపై వెచ్చఁదన మున్నదా
మందెమేళమున నీతో మాటలాడితిమి గాక[6]
కందువ మన్నన చాలు కలకాల మెల్లను
॥ఏ॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 1వ సంకీర్తనగా ఉంది.)

[1] నిడురేకు 43 నీకు నుండనేలనీ
[2] గాననేరక
[3] గలరు ఈ
[4] బుచ్చనేలరా
[5] నిడురేకు 43 విందవు నీ
[6] తిమినీ
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము