Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 102 సంకీర్తన: 102
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 85
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
ఒంటినేల తిరిగేవే - వో చెలియ, నా
వెంట బాయకువె పది - వేలకైనా, నీవు
॥పల్లవి॥
వొంటి పొదరింటిలోన - నుండఁగా నాకన్నులకు, నీ
చంటి జంట కానరాగ - జక్కవలంటా
వుంటవింట నేసేనంట - వూకించి నేనొత్తిన గో
రంటు జూచి గుండె జల్లు - రనెగదే కోమలి
॥ఒంటినేల॥
పొదల తీఁగెచాటున - పొంచియుండ(గ) నీమోవి
తుదగానరాఁగ జూచి - దొండపండంటా
చిదిమేనంట నే బోయి - చేయి చాచి యలకెంపు
చిదురుపలంగని వెర - చితిగదే కోమలి
॥ఒంటినేల॥
(హత్తి) యలమేల్మంగ పయ్యెద - యడయైన పొక్కిలి తళు
కొత్తగా బూచిన తామెర - కొలనంటా నే బోయి
(గత్తరి) శ్రీవేంకటపతిమై - కలగని (బత్తిని)
(మెత్తని) కౌఁగిటిలో న - మ్మితిగదే కోమలి
॥ఒంటినేల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము