Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 71 సంకీర్తన: 70
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 90
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది - ఆది
కంకణ మిదిగో చూడ - గదరమ్మ, వీర
కంకణ మతని కిగా - గట్టితి నోయమ్మలాలా
॥పల్లవి॥
నన్నిక నేమి పలుమారు - నలయించకు రోయమ్మ
కన్నెనై యతనిపై వే - కన్నులోయమ్మ
వున్నవేమి సహించవు - వూరకుండ గదరమ్మ
యెన్ని చెప్పినా మానరు - యేలచలమమ్మలాలా
॥కంకణ॥
ఒంటి నన్నేక చిత్తాన - వుండనియ్యగదరమ్మ
వెంటవెంట వచ్చి యేల - వేచేరోయమ్మ
ముంటిమీది తపమున - మునినైయున్నానోయమ్మ
అంటు బాయలేనెంతైన - అతనితో నమ్మలాలా
॥కంకణ॥
ఎరవులవారివలె - నేమియు నన్ననకురమ్మ
మరులైతినో యలమేలు - మంగనోయమ్మ
తిరువేంకటగిరి - దేవశిఖామణి
వురముపై యుయ్యాల - వూగేనిట్లేయమ్మలాలా
॥కంకణ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము