Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 4 సంకీర్తన: 3
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 92
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లుప్తము
కంటి శుక్రవారము గడియ లేడింట
అంటి అలమేల్మంగ అండనుండే స్వామిని
॥పల్లవి॥
సొమ్ములన్నీ కడఁబెట్టి సొంపుతో గోణముగట్టి
కమ్మని కదంబముకప్పు పన్నీరు
చెమ్మతోన వేష్టువలు ఱొమ్ము తల మొల చుట్టి
తుమ్మెదమైచాయతోన నెమ్మదినుండే స్వామిని
॥కంటి॥
పచ్చకప్పురమె నూఱి పసిఁడిగిన్నెల నించి
తెచ్చి శిరసాదిగ దిగ నలఁది
అచ్చెరపడిచూడ అందరికన్నుల కింపై
నిచ్చమల్లె పూవువలె నిటు తా నుండే స్వామిని
॥కంటి॥
తట్టుపునుఁగె కూర్చి చట్టలు చేరిచి నిప్పు
పట్టి కరఁగించి వెండిపళ్యాల నించి
దట్టముగ మేనునిండ పట్టించి దిద్ది
బిట్టువేడుక మురియుచుండే బిత్తరి స్వామిని
॥కంటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము