Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 238 సంకీర్తన: 249
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 131
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి - అట
తలచి (పాసీ యుండ) రాదు - తలచకుండగ రాదు మదిలో
తలపు తగులుగ జేసె గదవే - తరుణి యలమేల్మంగను
॥పల్లవి॥
కలికి కౌగిట బిగిసి ఆయము - కరగు నిమిషము పేరుకొనగా
పిలిచి నే నొక మాట యడిగిన - పెదవి పెదవిని మోపుచున్‌
మొలకనవ్వుల పంటి మొనలను - మోవి నొక్కుచు మోడ్పుగన్నుల
నలమి సిగ్గున మోము మోమున - నప్పళించే కలికిని
॥తలచి॥
అలక లటు నిటు చెదర నఖముల - నల్లనల్లన గూడ దువ్వుచు
చెలువుడా బడలితివొ యని తన - చేత నా మెయి నిమురుచు
అళులబోలెడు చూపులను నా - యాననాబ్జము నందె నిల్పుచు
తళుకుగన్నుల హరుష జలములు - తొలకరించే కలికినీ
॥తలచి॥
చిలుకగోరున నాదు చెక్కిలి - జీరి ముద్దాడుచును చెవులలొ
పలుకుచును తా బలుకరింపుచు - ప్రాణములు రెం డొకటియై
మెలకువను రతికేళి వేళల - మెచ్చు లొసగుచు ప్రియము సేయుచు
పలుకకుండిన ప్రేమమున నను - బలుకరించే చెలియను
॥తలచి॥
మొలకపులకల నాదు దేహము - కలయికల చిరుచెమట పట్టగ
వలిపపయ్యెద చెరగు సురటిగ - వామకరమున విసరుచున్‌
చెలియ తన వలకేల నా మెయి - చెమట దుడుచుచు బుజ్జగింపుచు
వలపు వాతెర తేనెలను నా - వాడుదేర్చు లతాంగినీ
॥తలచి॥
కులుకుగుబ్బల నాదు ఉరమున - గుచ్చి గోరాడుచు నదిమి పట్టగ
మెలకువన తన జడను జుట్టుకు - మెదలకుండను బట్టుక
పలుకురా యిక వేంకటేశ్వర - ప్రాణనాథుడ వనుచును
నలసి యురముననుండి పలికే - యట్టి యలమేల్మంగను
॥తలచి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము