Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 198 సంకీర్తన: 206
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 148
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
[1]దేవర వంటివాడని - తెలియనైతి [2]నిందాకా
చేవదేర బుద్ధి చెప్పి - సేవ గొనవయ్యా
॥పల్లవి॥
మొన్న నా కాలు దాకితే - మ్రొక్కమరచి యుండితి
(చెన్నుగా)[3] నీ వేళైనా మొక్కేను - చేరరావయ్యా
నిన్నటి మా తమ్ములము - నీ చెక్కిలిపై నున్నది
పన్నీటినైనా కడిగేను - బడినే రావయ్యా
॥దేవర॥
సారెకు నీవు రాగా మం-చము మీద నుండినట్టి
నేరము (బాపుకొనే నే - డింటికి రావయ్యా)
[4]వోరికొట్లు గొట్టితి - నుబ్బి జవ్వనమదాన[5]
గారవించవలె నే - కాంతానాను రావయ్యా
॥దేవర॥
ఏనాటికి నీవే చన - వీయగ నెదకెక్కితి
నేనాటదాన నీవే దయ - నేలుకొనగ రావయ్యా
మానిత సద్గుణ నిధాన - మాధవ కృష్ణాయని ని
న్నూనిన భక్తింగొల్చెద - నొద్దిక చేకొనుమయ్యా
॥దేవర॥
అలమేలుమంగనని - అట్టె నీ వురమెక్కితి
యెలమితోఁ గౌఁగిలించే - నీడకు[6] రావయ్యా
కలసి రతుల వేం - కటనాథ గెలిచితివి
పలుదెరంగుల మోవి - పంతమిచ్చే రావయ్యా
॥దేవర॥

[1] ఈ పాట వ్రాతప్రతిలో పునరుక్తమైనది (చూ. సంకీర్తన - 209) ఇదే పాట తంజావూరిప్రతిలో బిలహరిరాగమున నున్నది (సం.కీ. 86)
[2] మిందాక (తా.సం.); నిందాక
[3] తం.ప్ర.
[4] వోరికొట్లు (తా.సం.), రాకొట్టుట వంటిదే ఓరిగొట్టు ప్రయోగము
[5] జవ్వనముదాన (తం.ప్ర.)
[6] యిటు (తా.సం.) ముద్రను బట్టి ఈ పాట చినతిరుమలాచార్యులవారిదిగా తోచును
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము