Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 40 సంకీర్తన: 39
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 155
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: శంకరాభరణం
నానావుపాయముల నన్నుఁ గాచేది పాడి
దీన రక్షకుఁడ నాకు దిక్కయి నిలువవే
॥పల్లవి॥
శరణు చొచ్చినవాఁడు సర్వాపరాధి యైనాను
పరగఁ దప్పులు మఱి పట్టఁ దగదు
సరవిఁ బాఁతవాఁడెంత సలిగలఁ బొరలినా
అరసి యందుకుఁగా నలుగఁగఁ దగదు
॥నానా॥
పంచ చేరి వున్నవాఁడు పనికిరాకుండినాను
వంచనతో వాని విడువఁగఁ దగదు
కొంచెపడి మొక్కేవాఁడు గుణహీనుఁడైనాను
అంచెల మొగమాడక అదలించఁ దగదు
॥నానా॥
మన్నన బంటైనవాఁడు మందెమేళాన నుండినా
పన్ని మనసున యెగ్గుపట్టఁ దగదు
యిన్ని విధములవాఁడ నిటు నే శ్రీవేంకటేశ
నన్నుఁ గాచుట గాని మిన్నక దూరఁ దగదు
॥నానా॥

(ఈ సంకీర్తన 15వ సంపుటంలో 370వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము