Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 220 సంకీర్తన: 231
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 244
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
విన్నవించనెట్టు వచ్చు వెలఁదియున్నచంద మిదివో
కన్నులార నీవె చూచి గతులు దెలుసుకోవయా
॥పల్లవి॥
తరుణి నిన్నుఁ దలఁచి తలఁచి తమకమాఁప నలవిగాక
శిరసు వంచి చింతలందు చిగురుగోయఁ దొడఁగెను
పురిగొనంగ నిన్నుఁబాసి పొద్దుగడపలేక కెరలి
సరుగ గాలిమంటపమున సాముశాయఁదొడఁగెను
॥విన్నవించ॥
వలపు నిలుపలేక కోరికలను [1]తాడువేఁడిపేఁడి
అలరి వేగుదాఁక ముత్తియములు గుచ్చఁదొడఁగెను
కలయుఁదాక నోర్వలేక కడుఁబరాకు సేసుకొనుచు
నెలఁత తమ్మికొలఁకులకును నీరు నించఁదొడఁగెను
॥విన్నవించ॥
దప్పిదేర నీగుణాలు దడవి విరహ మార్చుకొనఁగ
కప్పురంపుఁ బలుకులెల్ల గాదెఁ బోయఁ దొడఁగెను
యిప్పుడిట్టె శ్రీవేంకటేశ నీవు గూడఁగాను
చెప్పరాని ననలఁ బూజసేయ నిన్నుఁ దొడఁగెను
॥విన్నవించ॥

(ఈ సంకీర్తన 28వ సంపుటంలో 4వ సంకీర్తనగా ఉంది.)

[1] తాడు + పేఁడి = తాడువేఁడి
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము