Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 214 సంకీర్తన: 225
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 245
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి[1]
విభుని వినయములు వినవమ్మ నిను
నభయంబడిగీ నయ్యో తాను
॥పల్లవి॥
రహస్యమున శ్రీరమణుఁడు పంపిన
విహరణలేకలు[2] వినవమ్మా
అహిపతిశయనంబతితాపంబై
బహువేదనకు అగపడె నట తాను
॥విభుని॥
ఆదిమపతి నీ యడుగుల కెరగిన
వేదాంతరచన వినవమ్మా
నీదయగానక నిమిషమె యుగమై
ఖేదంబున నలఁగీనట తాను
॥విభుని॥
కింకరుఁడట నీ కినుకసేఁతలకు[3]
వేంకటపతిగతి వినవమ్మా
సంకెలేక[4] నీ చనవున జగములు
కొంకకిపుడె చేకొనెనట తాను
॥విభుని॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 308వ సంకీర్తనగా ఉంది.)

[1] నిడురేకు 89: పురుషవిరహం
[2] లేఖలు
[3] కినుక చూపులకు
[4] సంకెదేరె
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము