అధ్యాత్మ సంకీర్తన
రేకు: 26-1
సంపుటము: 1-156
రేకు: 26-1
సంపుటము: 1-156
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఎనుపోతుతో నెద్దు నేరుగట్టిన యట్లు యెనసి ముందర సాగ దేఁటిబ్రదుకు | ॥ఎనుపోతు॥ |
| కడలేని యాసచే కరఁగి కరఁగి చిత్త- మెడమవంకకు వచ్చె నేఁటి బ్రదుకు పొడవైన మమతతోఁ బొదలఁ బొదల మాన- మిడుమపాట్లఁ బడె నేఁటి బ్రదుకు | ॥ఎనుపోతు॥ |
| తెగుదెంపులేని భ్రాంతికిఁ జిక్కి యాచార- మెగసి గొందులు దూరె నేఁటి బ్రదుకు పగగొన్న మోహతాపము వేరుగ విజ్ఞాన- మిగురువెట్టక మానె నేఁటి బ్రదుకు | ॥ఎనుపోతు॥ |
| భావింప రోఁతలోఁ బడి పొరలెడి సౌఖ్య- మేవగింపఁడు జీవుఁ డేఁటి బ్రదుకు శ్రీవేంకటేశుపై చిత్త మొక్కటె కాని యేవంక సుఖము లే దేఁటి బ్రదుకు | ॥ఎనుపోతు॥ |


